మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!
మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!
దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వంలో రూపొందిన తొలి భారతీయ మూకీ ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ (1913) దగ్గర మొదలుపెట్టి, హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో 1932 ఫిబ్రవరి 6న విడుదలైన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మీదుగా ఇప్పటి వరకు మన సినీ ప్రస్థానాన్ని పలు భాగాల డాక్యుమెంటరీగా తెర కెక్కించనున్నట్లు భోగట్టా. విష్ణు తీసే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కు ఆయన తండ్రి, నటుడు, నిర్మాత అయిన మోహన్‌బాబు ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లూ, తెలుగు సినీ పరిశ్రమకు తమ వంతు సేవగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లూ కృష్ణానగర్ కబురు.
ఈ విశిష్ట ప్రయత్నంపై వినవస్తున్న వార్తల గురించి ‘సాక్షి’ ప్రతినిధికి విష్ణు వివరణనిస్తూ, ‘‘అవును. డాక్యుమెంటరీ సిరీస్ తీయాలనుకుంటున్నది నిజమే’’ అని అంగీకరించారు. ‘‘నేను కొన్ని భాగాలు తీస్తే, మరో ప్రముఖ దర్శకుడు కొన్ని భాగాలు తీస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం’’ అని ఈ యువ హీరో తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం గురించి పూర్తి వివరాలను అధికారికంగా తెలియజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వివరాల మాట అటుంచితే, మన సినిమా చరిత్ర రికార్డు కాలేదని ఆవేదన చెందుతున్న సినీ ప్రియులకు ఇది శుభవార్తే. సాధికారికమైన సమాచారంతో, సమగ్రంగా ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం సాగితే అంతకన్నా ఇంకేం కావాలి! ఆల్ ది బెస్ట్ విష్ణూ!